Saturday 20 July 2013

టమాటా పప్పు

"One cannot think well, love well, sleep well, if one has not dined well."


ఆహారం అనేది మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. తినేది పంచభక్ష్య పరవాన్నాలు అయినా మామూలు భోజనం అయినా ఆస్వాదిస్తూ తింటే చక్కగా ఒంటబట్టి ఆరోగ్యంగా ఉంటాం. 

ఏదైనా సాధించాలన్నా మనం ఉసూరుమని నీరసంగా ఉంటే ఏమీ సాధించలేము. ఇంకా మనకే ఎవరో ఒకరు చాకిరీ చేయాల్సి వస్తుంది. 

అలా అని అదే పనిగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. రోజూ మనకొక షెడ్యుల్ వేసుకుని ఆ ప్రకారం ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఆహారం ద్వారా మనకి చేరేవిధంగా ప్లాన్ చేసుకోవాలి. 

ఈ బ్లాగ్ లో నాకు నచ్చిన(వచ్చిన) వంటకాలను మీకు పరిచయం చేస్తాను. నేను వెజిటేరియన్ కావడం వల్ల ఇందులో కేవలం శాఖాహార వంటకాలు మాత్రమే పరిచయం చేస్తాను. 

ఈ బ్లాగ్ ని ప్రారంభించి చాలా రోజులు అయినా ఒక్క పోస్ట్ కూడా రాయకపోతే ప్రియ గారు మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్ కలిగించి మళ్ళీ ఈ బ్లాగ్ ని ఆక్టివ్ చేసే లా చేసారు. వారికి నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. 

మరి ఇవాల్టి వంటకం ఏంటో తెలుసుకుందామా. 

ముందుగా నేను ఈజీగా చెయ్యగలిగే వంటకం టమాటా పప్పు. ఇది ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. 

కావలసినవి 

ఒక కప్పు కందిపప్పు (ఉడికించుకుని మెత్తగా చేసి ఉంచాలి)
సన్నగా తరిగిన ఉల్లిపాయ
సన్నగా తరిగిన రెండు పెద్ద టమాటోలు 
మూడు లేక నాలుగు పచ్చి మిర్చి పొడుగ్గా తరిగినవి 
సన్నగా తరిగిన అల్లం 
పావు స్పూన్ పసుపు 

పోపు 

ఒక టేబుల్ స్పూన్ నూనె 
అర టీస్పూన్ ఆవాలు 
అర టీ స్పూన్ జీలకర్ర 
ముక్కలుగా చేసిన మూడు లేదా నాలుగు ఎండు మిర్చీలు
అయిదు లేదా ఆరు వెల్లులి రెబ్బలు లేదా పావు టీ స్పూన్ ఇంగువ (వెల్లులి ఇంకా ఇంగువ కలిపి వేసుకోరు)
కరివేపాకు 


తయారు చేసే విధానం 

1.మూకుడు లో కొంచెం నూనె పోసి వేడి ఎక్కిన తరువాత అందులో పైన చెప్పిన మోతాదులో ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తరువాత జీలకర్ర, వెల్లులి, ఎండు మిర్చి మరియు కరివేపాకు వేసుకుని కలపాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు అల్లం వేసి ఉల్లిపాయలు గోధుమ వర్ణం లో కి మారే వరకు వేచాలి. 

2. ఆ తరువాత సన్నగా తరిగిన టమాటో లు వేసి నాలుగు లేదా అయిదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు మరికొంచెం ఉప్పు కలిపి బాగా కలపాలి. 

3. ఉడికించి రెడీ చేసుకున్న పప్పు ని ఈ మిశ్రమం లో కలపాలి. ఒక కప్పు నీళ్ళు పోసి మరి ఒక పది నిమిషాల్ వరకు తక్కువ మంటలో ఉడకనివ్వాలి. ఆ తరువాత కొత్తిమీర జల్లాలి. 

వేడి వేడి అన్నం తో లేదా రోటీ తో ఈ పప్పు బ్రహ్మాండంగా ఉంటుంది. 

సో, ఇవాల్టి వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ, 


మీ 
లాస్య రామకృష్ణ 





4 comments:

  1. భోజనానికి వచ్చేస్తున్నా!

    ReplyDelete
    Replies
    1. అయ్యో తాతగారు, మీదే ఆలస్యం. మీరు మా ఇంటికి భోజనానికి వస్తే అంతకంటే అదృష్టం మరొకటి లేదు. ఎదురుచూస్తుంటాము.

      Delete
  2. నేనే మీకు థాంక్స్ చెప్పాలి లాస్య గారు. గుర్తు చేసిన వెంటనే స్పందించి పోస్ట్ పబ్లిష్ చేసినందుకు :)
    నేనూ టమాటా పప్పు చేస్తాను, కాని అన్ని కలిపి ఉడికించేసి సపరేట్ గా పోపు దినుసులు వేయించుకుని వాటిని ఈ పప్పులో కలిపేసి ఓ 5 నిముషాలు మళ్ళీ స్టవ్ మీద ఉంచుతాను. ఇప్పుడు మీరు చెప్పిన విధానమూ బావుంది ప్రయత్నించి చూస్తాను.

    ReplyDelete